Teluguworld.wap.sh









విడుదల తేదీ : 23 మే 2014
TeluguWorld.wap.sh : 4.0/5
దర్శకుడు : విక్రమ్ కుమార్
నిర్మాత : అక్కినేని కుటుంబం
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రియ శరన్..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మరియు అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు కలిసి చేసిన సినిమా ‘మనం’. గత కొంత కాలంగా అక్కినేని అభిమానులు, సినీ అభిమానులు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న ‘మనం’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రియ సరన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. సరికొత్త కథ, కథనంతో మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన ‘మనం’ సినిమా ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథ :
‘మనం’ సినిమా 1983 ఫిబ్రవరి 13న మొదలవుతుంది. రాధా మోహన్(నాగ చైతన్య) – కృష్ణవేణి(సమంత) వివాహం జరుగుతుంది. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్ళిలో వీరిద్దరూ కొద్ది రోజులు ఎంతో అన్యోన్యంగా గడుపుతారు. వీరి ప్రేమకి గుర్తుగా బిట్టు పుడతాడు. కానీ కొద్ది రోజులకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకుంటారు. కానీ విడిపోవడం రాధా మోహన్ కి ఇష్టం ఉండదు. అప్పుడే అనుకోని పరిణామాల వల్ల ఇద్దరూ చనిపోతారు..

కట్ చేస్తే టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ నాగేశ్వరరావు(నాగార్జున) అనుకోకుండా కలిసిన నాగార్జున(నాగ చైతన్య), ప్రియ(సమంత)లపై అత్యంత ప్రేమని పెంచుకుంటాడు. ఈ జర్నీలో నాగేశ్వరరావు నాగార్జున – ప్రియలను కపాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో నాగేశ్వరరావు అనుకోకుండా చైతన్య(ఎఎన్ఆర్) కి చేసిన హెల్ప్ వల్ల అంజలి(శ్రియ శరన్) ప్రేమలో పడతాడు. చైతన్య నాగేశ్వరరావు – అంజలికి దగ్గరయ్యి వారిద్దరినీ కలపాలని చైతన్య ప్లాన్ చేస్తాడు.

అసలు రాధా మోహన్ – కృష్ణల కుమారుడు బిట్టు ఏమయ్యాడు? నాగేశ్వరరావుకి నాగార్జున – ప్రియకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? నాగేశ్వరరావు అనుకున్నట్టుగానే నాగార్జున – ప్రియ కలిసారా? అలాగే నాగేశ్వరరావు – అంజలిని కలపాలని చైతన్య ఎందుకు అనుకున్నాడు? అనుకున్నట్టుగానే వీరిద్దరూ కలిసారా? మొత్తంగా ఈ రెండు జంటలకి చైతన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :
‘మనం’ సినిమాకి మొట్టమొదటి హీరో లెజెండ్రీ నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఈ వయసులో కూడా నాగార్జున, నాగ చైతన్యని మించిన నటనని, డైలాగ్ డెలివరీని చూపించడం అనిర్వచనీయం అని చెప్పాలి. ముఖ్యంగా చై చైతన్య అని చెప్పే సీన్స్ లో, మందు తాగే ఎపిసోడ్ లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి మాటల్లో చెప్పలేం. ఎఎన్ఆర్- నాగ చైతన్య కెమిస్ట్రీ సూపర్బ్.

ఇక ఆయన తర్వాతి తరం హీరో నాగార్జున విషయానికి వస్తే నాగేశ్వరరావు పాత్రలో చిన్నపిల్లాడిలా, అమాయకుడిలా సూపర్బ్ గా నటించారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పల్లెటూరి సీతారామ్ పాత్రలో నటించడం కన్నా జీవించాడని చెప్పాలి. ఇక మిగిలిన మన యంగ్ హీరో నాగ చైతన్య నటనలో ఎంతో ఎంతో పరిపక్వతని చూపారు. ముఖ్యంగా నాగార్జున పాత్రలో అందరూ ఓ సరికొత్త నాగ చైతన్యని చూస్తారు. తన పాత్రలో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. నాగ చైతన్య ఎన్నడూ లేనతంగా తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సమంత చేసిన రెండు పాత్రల్లో ఒకటేమో హోమ్లీ గర్ల్, మరొకటేమో బబ్లీ గర్ల్. హోమ్లీ గర్ల్ పాత్రలో ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేక్షకులను మెప్పిస్తే, బాబ్లీ గర్ల్ గా మరోసారి కుర్రకారు హృదయాన్ని కొల్లగొడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక శ్రియ శరన్ కూడా రెండు పాత్రలు చేసింది. అందులో ఒకటి పల్లెటూరి అమ్మాయి అయితే మరొకటి సిటీలో పెరిగిన అచ్చ తెలుగమ్మాయి. రెండు వైవిధ్యమైన పాత్రల్లో శ్రియ నటన అద్భుతంగా ఉంది. శ్రియకి ఇది పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాల్సింది ఇద్దరు హీరోయిన్స్ చాలా గ్లామరస్ గా ఉంటారు.

సినిమా పరంగా హైలైట్స్ విషయానికి వస్తే ఎఎన్ఆర్ – నాగార్జున – నాగ చైతన్య మధ్య వచ్చే సీన్స్ అన్నీ అద్భుతం అని చెప్పాలి. అలాగే వీఇమధ్య కెమిస్ట్రీ కూడా అదుర్స్ అని చెప్పాలి. ఒకేసారి స్క్రీన్ పై ఆ ముగ్గురిని చూడటమే కళ్ళకు కనువిందు కలిగిస్తే వారి మధ్య జరిగే సీన్స్ లో ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకోవడం ప్రేక్షకుల మదిలో అమితానందాన్ని కలిగిస్తాయి. నాగార్జున – సమంత, నాగార్జున – నాగ చైతన్య మధ్య వచ్చే సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

సినిమాలో ప్రతి పాటా ఎంత పెద్ద హిట్ అయ్యిందో స్క్రీన్ పైన అంతకన్నా పెద్ద హిట్ అయ్యాయి. సినిమాలో ప్రతి పాత్రకి ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగుంది. సినిమాకి ఇంటర్వల్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ అప్పుడు ప్రేక్షకులు ఒకింత షాక్ కి గురవ్వడమే కాకుండా వాహ్ ఇరగదీశాడు రా అనుకుంటారు. అతిధి పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్, నీతూ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేసారు. అలీ, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణ మురళీ కొంతవరకూ నవ్వించారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ – అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఎంట్రీ, ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ లో రావడం సినిమాకి మేజర్ హైలైట్. 200 స్పీడ్ లో వెళ్తున్న బైక్ స్పీడ్ ఒక్కసారిగా డబుల్ అయితే ఎలా ఉంటుందో.. అదే రేంజ్ లో అఖిల్ రాగానే ‘మనం’ సినిమా హై రేంజ్ కి వెళుతుంది. అఖిల్ లుక్ అండ్ స్టైల్ సింప్లీ సూపర్బ్..సూపర్బ్…

మైనస్ పాయింట్స్ :
సినిమా అంతా చూసిన తర్వాత అందరి మదిలో మెదిలే మొదటి ఆలోచన ఎఎన్ఆర్ పాత్ర ఇంకాస్త పెద్దదిగా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. అక్కడక్కడా కొంచెం సాగదీసినట్టు, రిపీటెడ్ గా అనిపించే సీన్స్ ఉన్నాయి. వాటిని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. బ్రహ్మానందం పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :
ఇలాంటి సున్నితమైన కాన్సెప్ట్ ని తీసుకొని ఇంత అందంగా తెరకెక్కించిన విక్రమ్ కె కుమార్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇలాంటి సినిమాలన్నీ స్క్రీన్ ప్లే మీదే ఆధారపడి ఉంటాయి. కానీ విక్రమ్ కుమార్ సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా రాసుకున్న కథనం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అందుకే ఆయననికి హ్యాట్సాఫ్ చెప్పాను.. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో 100/100 మార్కులు కొట్టేసాడు. అలాగే విక్రమ్ కుమార్ ని ఇంకో విషయంలో కూడా మెచ్చుకోవాలి. కామెడీ కోసం పక్కదార్లు, కమెడియన్స్ ని మాత్రమే నమ్ముకుంటున్న ఈ రోజుల్లో ఆయన మాత్రం సందర్భానుసారంగా(సిచ్యువేషనల్) కామెడీ రాసుకొని, అది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినందుకు ఆయన్ని మెచ్చుకునే తీరాలి. ఇక ఆయన రాసుకున్న కథకి, సీన్స్ కి హర్షవర్దన్ అందించిన డైలాగ్స్ పర్ఫెక్ట్ గా సరిపోయాయి.

డైరెక్టర్ తర్వాత ఈ సినిమాకి ప్రాణం పోసింది ఇద్దరు.. వారిలో ప్రధముడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే పాటలను అందించడమే కాకుండా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశాడు. సీన్ లో ఉన్న ఫీల్ ని తన మ్యూజిక్ తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేసాడు. ఇక రెండవ వ్యక్తి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్. డైరెక్టర్ అనుకున్న దాన్ని అనుకున్నట్టు చూపించాడు. ప్రతి ఫ్రేం చాలా గ్రాండ్ గా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్రతి ఫ్రేం మన మదిలో నిలిచిపోతుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. ఈ సినిమా విషయంలో లిరిసిస్ట్ ని కూడా మెచ్చుకోవాలి. సీన్స్ తీసాక వాటిని చూసి పాటలు రాసారో లేక పాటలు రాసాక సీన్స్ తీసారో తెలియదు గానీ పాటలో ఉన్న ప్రతీ పదానికి డైరెక్టర్ స్క్రీన్ పై జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఇది మనం చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. అక్కినేని కుటుంబం నిర్మాణ విలువలు ‘మనం’ సినిమా మన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసును బాగా హత్తుకొని వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. ఎన్ఎన్ఆర్ చివరి సినిమా అని అందరూ అనుకున్నప్పటికీ ఆయన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రని వేసుకున్నారు. మల్టీప్లెక్స్, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరి మనసుకు హత్తుకునే సినిమా ‘మనం’. ఎన్ఎన్ఆర్, నాగార్జన, నాగ చైతన్యల పెర్ఫార్మన్స్, వారి కాంబినేషన్ సీన్స్, సమంత, శ్రియ శరన్ నటనలతో పాటు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ మరియు చివర్లో కొసమెరుపులా వచ్చే అఖిల్ ఎంట్రీ ‘మనం’ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఈ మండు వేసవిలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా మీ కుటుంబసమేతంగా థియేటర్ కి వెళ్ళి ఎంతో హాయిగా ‘మనం’ సినిమా ఎంజాయ్ చేయండి. ప్రతి తెలుగు ప్రేక్షకుడు తప్పక చూడాల్సిన సినిమా ‘మనం’. చూసిన ప్రతి ఒక్కరూ ఓ వండర్ఫుల్ ఫీలింగ్ తో బయటకి వస్తారు అన్నదానికి నాది గ్యారంటీ..

సినిమా చివర్లో ఎఎన్ ఆర్ ని ఉద్దేశిస్తూ నాగార్జున చెప్పిన మాటలు ‘నువ్వే మా స్పూర్తివి.. నువ్వే మా ఆర్తివి.. తెలుగు వారి గుండెల్లో చెరగని చిరునవ్వు మీరే’.. అవును ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో చెక్కు చెదరని చిరునవ్వుగా మిగిలిపోతారు.. “ANR is more Here”..



TeluguWorld.wap.sh:-4.0/5




Users Online


3791

Duck hunt